నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Monday, September 5, 2011

అక్షరం

  అక్షరం గురించి వ్రాయమంటే ఏదో అలా అలా వచ్చిన కొన్ని పదాలని ఇలా మీ ముందు ఉంచాలనిపించింది...
                                            

క్షరం  అంటే నాశనం
అక్షరం=నః క్షరం  - అంటే నాశనం కానిది, నాశనమనేదే లేనిది; ఇది అక్షరానికి భాషాపరమైన అర్ధం.
మనోభివృధ్ధి సాధించిన మేధా సంపత్తి కలిగిన ప్రాణి మనిషి. తనదైన శైలిలో జీవించటానికి, తనదైన ఉన్నతమైన సంక్లిష్ట భావజాలాన్ని వ్యక్తీకరించటానికి అలాగే వ్యక్తీకరించబడినదాన్ని స్వీకరించటానికి తనకి అవసరమైన మాధ్యమం భాష, ఆ భాష అక్షరాల అమరిక. ప్రపంచమంతా నిభిడీకృతమై ఉన్న సర్వోత్కృష్టమైన జ్ఞాన సంపదని అర్ధం చేసుకునేందుకు , ఆ సంపదని మానవాళి శ్రేయస్సుకి ఉపకరించేట్టు చేసేందుకు అవసరమైన అక్షర జ్ఞానం ఆవశ్యకత వర్ణింప శక్యం కానిది. ఆ అక్షర జ్ఞానం కలిగి ఉండటం అక్షరాస్యత, అది లోపించటం అనేది నిరక్షరాస్యత.

    ఒక నిరక్షరాస్యుడు తన అవసరాన్ని సరిగా వ్యక్త పరచలేని ఒక సామాన్య అవసరం నుండి ఉధ్ధండమైన ప్రయోగాలతో జనావళికి తన పరిశోధనా సేవలందించే శాస్త్రవేత్త ఉపయోగించే భాష్యం వరకూ అవసరమయ్యేదంతా ఆ అక్షరాస్యత నుండి పుణికి పుచ్చుకుచ్చుకోవాల్సిన జ్ఞాన సంపదే. అక్షరాలు పదాలనీ, పదాలు వాక్యాలనీ, వాక్యాలు విషయ సంపదనీ నేర్చుకునేందుకు దోహదం చేసి తద్వారా విచక్షణ అనేది అలవడేలా చేస్తుంది. విచక్షణ లేకుండా ప్రవర్తించే మనిషి మృగ సమానుడు. మనిషి స్వభావం ఎలాంటిదైనప్పటికీ దానిని మార్చి తనలో సమాజ హితునిగా పరివర్తన తీసుకురాగల మంత్రం అక్షర మంత్రం.
   
    అక్షరమనే మాతృక జ్ఞానమనే సంపద సాధించటానికి ఉపయోగపడితే, జ్ఞానం విద్వత్తు  జనించేందుకు ఉపకరిస్తుంది. విధ్య కలిగిన వాడు లోకమెల్లా  పూజింపబడతాడు అనే పెద్దల సూక్తి నిత్య సత్యం. అక్షరాన్ని గురించి ఇలా ఎన్ని అక్షర సత్యాలు చెబుతున్నా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కూరగాయలు తరిమే కత్తి ని ప్రావీణ్యత లేని వాడు దానిని ఉపయోగించినా లేదా హత్యలు చేయాలనే వాడు ఉపయోగించినా అది రక్తం కళ్ళ చూస్తుంది. అక్షరం అనే సాధనం‌ చాలా ఉన్నతమైనదీ మరియు ఎంతో శక్తివంతమైనదీనూ. చిన్ననాటి నుండీ సమాజ శ్రేయస్సుకి సంభందితమైనపోకడలని అలవర్చుకున్న మనిషి  చేతిలో  అక్షరం ఏనాటికైనా ఒక మహాద్భుతాన్ని  చూపుతుంది. కాలి నడక నుండి గాలి నడక వరకూ అభివృధ్ధి సాధించిన మనిషి గొప్పతనం, కొండంత నుండి గోరంతవరకూ చేరుకున్న ఉపకరణాల పరిమాణం వాటి ఉపయుక్తం ఇలా చెప్పగా కోకొల్లలవి. కరడు గట్టినట్లు రహస్యాలను దాచుకున్న  ప్రకృతి మానవుని ముందు చేతులొగ్గి వాటిని బయట పెట్టటానికి కారణం, మనిషి తాను సంపాదించిన జ్ఞానాన్ని పంచుకోగలిగే మరియు దాచుకోగలిగే సాధానంగా, మాధ్యమంగా ఉపయోగించబడుతున్న అక్షరం మన మనిషుల ఉనికికే తలమానికం, ప్రతిభకే ఆలవాలం. దురుపయోగంలో ఉన్న అక్షర జ్ఞానం దాని పర్యవసానాన్ని సమాజ చీడ పురుగుగా మార్చటం ఖాయం.
   
    ఏది ఏమైనా మనిషిని మనిషిగా నిరూపించగలిగే అక్షరం ఒక అమోగమైన సాధనం, కానీ అది సాధనం మాత్రమే, నిన్ను మనిషిగా చూపించలేక మృగంగా నువ్వు మారితే అది నీలోని అక్షర దోషం తప్ప అక్షరంలో స్వయంగా దాగి ఉన్న దోషం కాదది. అనిర్వచనీయమైన వాడి అందుకు సరిపడ వేడిని కలిగున్న అక్షరంతో పాటుగా దానిని ఉపయోగించే దారి అనే జ్ఞానాన్ని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని విధ్యావంతుడైన మనిషిగా నిలదొక్కుకోగలిగే సామర్ధ్యాన్ని  అందరూ పెంపొందించుకోవాలని ఆశిధ్ధాం.