నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Saturday, July 31, 2010

నీ సిగ్గు బుగ్గలో ఎర్రదనం..

Click here to read post with white background

నీ సిగ్గు బుగ్గలో ఎర్రదనం, నీ చిరుకోపంలో చక్కదనం
నీ హృదయంలో నా ప్రేమ ధనం...
నువ్వు లేకున్న నాకదే మరణం
కానా నేను నీకు తృణం 

Friday, July 30, 2010

నీలి ఆకాశంలో, నల్లని మబ్బుల్లో.....


వర్ణించినా, పొగిడినా, వివరించినా... ప్రేమ ప్రేమే, అమ్మ పెట్టే పాల బువ్వ మెతుకులో అణువణువున ఉన్నా, నాన్న చూపే భాద్యతల భవ బంధమైనా, ప్రేయసికి(పై) ఉండే ఆరాదన ఐనా... ఏదైనా ప్రేమ ప్రేమే... దేవుడున్నాడో లేడో తెలియదు కానీ, తన ఉనికికి ఆధారమన్నట్లుగా మనకనవసరమైన అమృతాన్ని కాకుండా, అమోఘమైన ప్రేమని అందించాడు.. ప్రేమ విరహం, ప్రేమ విరసం, ప్రేమ స్వైర విహారం సర్వం అద్భుతం. నలిగిపోయిన హృదయం నా మాటల్ని ఒప్పుకోదు, ఔను నా హృదయాన్ని విన్నాకే చెబుతున్నా... తన ఉనికి ఏ తునకలూ లేనప్పుడు, ప్రేమని చంపలేని హృదయం అదే మరణిస్తుంది 

Thursday, July 29, 2010

'అనంత'ర్మధనం..

click here to view post in white background

నిన్న ఎలా జరిగిందో ఈ రోజు అలాగే జరిగింది.. లాటిన్‌ భాషలో అనుకుంటే రెండు సార్లు వండిన ఒకే పదార్దపు పొట్లాం కొనుక్కోవటం తప్పితే.. అంతా అలానే జరిగింది, ఐనా బ్రెయిన్‌కేమయిందో ఏమో.. పదికీ, ఏభైకీ తేడా తెలియనంత పోయిందా మతీ.  ఏదేమైనా నీకు నిజంగా చాలా ఎక్కువైంది. ప్రపంచమేదీ నీది కాదని అంటావ్.. మరెందుకు ఆ ఆలోచన. ఒక మనిషి ఆర్తనాదం అతి దీనంగా వినిపించినా కించిత్‌ కూడా నీ అంతర్వాహిణిలోకి పరిగ్రహించక, పరిగణించక నిర్లోపభూయిష్టంగా తత్కర్మానుష్ఠానుడివై యుండియూ హృదయ చలనశీలుడివవ్వవే. తామరాకుపై నీటి బొట్టులా అని భగవద్గీత ప్రభోదామృతాసేవనములో తరించిన వానివలె మసలెదవే, ఒక చిన్న కార్య సారూప్యత ఎలా అలా చేసింది. ముసుగులో గుద్దులాట సంగ్రామమా, సరస సల్లాపమా, లేక శృంగారమా ఏమనుకోవాలి. బయటకొచ్చి బయటకే వెళ్తావు, ఇంటనుండీ ఇంటనే ఉంటావు. బయటకి బయట బయటా కాదూ లోపలకి లోపటల లోపలా కాదు. మూగ భాషకి లిపి తయారు చేసి పంచుదామనా.. నీకు తెలీదేమో మనసులు నిరక్షరాస్యులు, వాటికి చదవటం రాదు. మనసు భాష లిపి తయారు చేసే బదులు, కళ్ళు మూసుకుని బ్రెయిలీ నేర్చుకో, అలాగైనా మూసిన కనులు నీ స్థబ్దు మనసుని కదిలించక మిన్నకుంటుందేమో....... నీ గుండెకి రక్త పంపిణీ తప్ప స్పందించే పని ఉండదు, స్పందించినా అది హృదయాగ్ని పర్వతమై ఆ వేడికి నీరు ఆవిరై చల్లబడి నీ కన్నీళ్ళ ఎత్తి పోతల జలపాతాలవుతాయి తప్ప నీ హృదయ స్పందన కారణం ప్రశ్నార్ధకమూ, నిరర్ధకమూనూ. అరవై అప్లికేషన్లోపెన్ చేసి ఆపరేటింగ్ సిస్టంని అరగంట హ్యాంగైపోయేట్టు చేసే, నువ్వెందుకు హ్యాంగైపోయావ్. హేతువవ్యక్తమై యున్న నీ మృతకారకమృతంబెరుగునా తమ జనకేయా? మధనపడిన ఊరడిల్లునా మనసెల్ల, బాధలు పరఢవిల్లి నీ ఉల్లమునెల్ల లొల్లి లొల్లి చేయవా? మతిసుతులు లేని మనసున పేరుకొన్నట్టి ప్రీతిపాత్రతని వధించి, మృత జీవనుడివై చరించుమురా.. ఎందుకన నీది కాని నిధి నీదగునా, నీదైనది వేరొకరి వశమగునా.. అందునా నీవెవరో, నీదేదో నీవెరుంగువానివా???!!

Tuesday, July 27, 2010

సెక్స్ & సమాజం...


click to read this post in white background

    సెక్స్, ఇంటర్‌కోర్స్, తెలుగులో రతి క్రీడ ఇంకో పదం కామ కేళి... ఈ పదాలు వినపడితే ఒక సగటు టిపికల్ ఇండియన్, అవి పలికేవాడ్ని ఒక ఇడియట్‌గా, బేవార్సిగా, పనికిమాలినవాడిగా పరిగణించే సందర్భాలు చాలా ఉంటాయ్..
  
    సెక్సనేది సామాజికంగా అందరికీ తెలిసిందే, ఫిజియొలాజికల్‌గా ఆలోచిస్తే ఒక కాఫీ తాగాలనే ఆలోచన, ఒక పాఠం చదవాలనే ఆలోచన, ఒక మంచి ప్రదేశాన్ని చూసి రావాలనే ఆలోచన .. etc. వీటి కన్నా వేరైతే కాదు సెక్సనేది. మరి ఎందుకని మన దేశంలో సెక్సంటే, దాని గురించి మాట్లాడకూడని విషయంగా పరిగణిస్తారు?, ఇతర దేశాల వాళ్ళలా  దాన్ని సాధారణమైన ఫిజియోలజీ అవసరాలలా ఎందుకు సెక్సుని ఒక సగటు ఇండియన్ భావించడు?, పబ్లిక్లో తనకంటూ ఒకింత ఇమేజున్న ఏ మనిషీ సెక్సు గురించి మాట్లాడాలనే ఆలోచన వచ్చినంతనే ఎందుకు జంకుతాడు?..
   
    నేను హిస్టోరియన్ని కాదు కాబట్టి సాంప్రదాయ పధ్ధతుల ఆవిర్భావం గురించి చెప్పలేను, కానీ పై పేరాలో ఉన్న ప్రశ్నలు అడగటానికి గల పర్యవసానాలు ఎందుకు మంచివని నాకనిపించాయో చెబుతాను. బేసిగ్గా మనం ప్రతి రోజూ నిర్వహించే పనులు రెండు రకాలు, మనకి మనం ఆలోచించి ఎవరి సహాయమూ లేదా అవసరమూ లేకుండా చేసే పని.. రెండోది ఆలోచన మనదే ఐనా మనతో పాటు వేరే మనుష్యులు కూడా ఉండి నిర్వహించవలసినవి. మనిషి శరీరానికి ఉండే సామాన్య అవసరాలలో తనకి తానుగా నిర్వహించకోగలిగేవి ఆలోచించటం, గాలి పీల్చటం, తినటం, నిద్రపోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం ఇలాంటివి అలాగే తనకి ఇతరుల సహాయం అవసరమయ్యే విధంగా ఉండే కార్యాలలో సంపాదించటం, మాట్లాడటం, ఇలా ఈ కోవలో కూడా చాలానే ఉన్నాయ్.. అందులో సెక్స్ ఒకటి.. నిజానికి తను స్వయంగా తాను నిర్వహించుకునే విషయాలకున్నంతటి అవసర తీవ్రత.. ఇతరుల సహాయంతో తను చేసే ఏ ఇతర పనులలోనూ ఉండదు, ఒక్క సెక్సులో తప్ప.. ఏం ఒప్పుకోరా? :) ఒక్కసారి ఉదయాన్నే లేచి బాత్రూముకెళ్ళాల్సిన పరిస్థితికి మీరు మాత్రమే కాకుండా ఇంకొక మనిషి ఆవసరం అనేది ఆ పనికి ఉంటే!?!?!..(వద్దూ, ఆపూ, ఊహించుకోలేకపోతున్నాం!!), ఓకే ఓకే వర్ణనలు ఆపేసి విషయానికొద్దాం.. ఇలా మన శరీరం తనకున్న స్వయం అవసరాలన్నిటిలో ప్రత్యుత్పత్తికి వేరే వారి అవసరాన్ని ప్రకృతి పరంగా ఏర్పరుచుకుంది. ఇతర అవసరాలకి భాగస్వామి అవసరం ఉన్నా, అలాగే సెక్సుకి కూడా భాగస్వామి అవసరం లేకపోయినా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.. రెండో‌ ఊహే కనక నిజమైతే ప్రతి మనిషీ తన దేహమే దేశమై తిరుగుతూ జీవిస్తాడన్నా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు.
   
    సంఘజీవనం గడిపే మనిషికి పబ్లిగ్గా సెక్సు అనే పదానికి తత్సంభందిత కార్యానికి సంభందించి సిగ్గు లాంటివి గట్రా ఆవిర్భవించటానికి గల కారణాన్ని సాంఘికంగా మరియు మానసికంగా ఆలోచిస్తే, శరీరం అవసరంగా భావించే సెక్సు అనే ఫీలింగుని తలదన్నే విధంగా మానసిక అవసరాలైనటువంటి ప్రేమ, అభిమానం, భాద్యత, సమాజం అంటే భయం లాంటి ఫీలింగ్సన్నీ కలగలసి, భాగస్వామి అవసరముండే సెక్సుకి ఇవన్నీ అవధులు, అవరోధాలుగా ఏర్పడి వాటిని దాటి వెళ్ళేందుకు పధ్ధతులూ అవీ గట్రా ఏర్పడి.. చివరకి ఆ పధ్ధతికి వ్యతిరేకమైన ధోరణిలో వచ్చే మాట కూడా ఒక నేరంలాగా భావించబడే స్థాయికి సమాజ జీవిన విధానం చేరిందని నా అభిప్రాయం..
   
    బయొలాజికల్‌గా ఆలోచిస్తే, మనిషి ఇంట్యూషన్ నుండి వచ్చిన పధ్ధతుల వలన.. ఎవరు ఎవరితో సెక్సు చెయ్యాలనేది నిర్ణయింపబడిన విధానంలో జీన్సు ట్రాన్సఫర్ అనేది  స్వపరాగ ధోరణిలో కాక పరపరాగ ధోరణిలో జరగటం వలన సమాజ స్థితి అభివృధ్ధి పథంలో ఉంది.. లేకుంటే సెక్సు యొక్క విచ్చలవిడితనంలో జీన్ లీచింగ్ జరిగి మనకి అవసరమయ్యే ఎన్నో మంచి జీన్సుని కోల్పోయి ఉండేవాళ్ళం.. మన ఆలోచనా పరిధి మరియు మన సాధన, మన వ్యాది నిరోధక శక్తి ఇలా చాలా విషయాలలో ఇప్పటి స్ట్రెంగ్తు మనకి బహుశా ఉండేవి కావు.
   
    ఎప్పుడో సాంప్రదాయ యుగంలో ఏర్పడిన కొన్ని మంచి అలవాట్లు సామాజిక భాద్యతల మూసలో తరువాతి తరాలకి చేరవేయబడుతూ మనకి (సామాజికంగా)చాలా మంచి చేశాయని చెప్పొచ్చు. అంతే కానీ అపోహాపూరితమైన వివరణలకి లోబడి దాని గురించి అభిప్రాయాలని ఏర్పరుచుకోటం సరికాదని నా అభిప్రాయం.
   
    ఇది చదివాను.. తెలిసినదాని  ప్రకారం ఇప్పుడు సెక్సు ఎవరితో ఐనా, ఎలాంటివారితో ఐనా, ఎక్కడైనా ఇంకా ఎప్పుడైనా ఓకేనా?? ఇలాంటి వ్యంగ్యమైన ప్రశ్నాస్త్రం మీ మదిలో మెదులుతుందని నాకు తెలుసు. దానికి సమాధానంగా నేను చెప్పేదేంటంటే, ఒక మనిషిగా, నాగరికుడిగా, మన సమాజపు మరియు ప్రపంచ పౌరుడిగా "రెండో మనిషి"కి ఇబ్బంది కాకుండా నువ్వేమైనా చెయ్యి... ;)

మోడువారిన వృక్ష సమిధనే..

ప్రేమ సఫలమైతే మిగిలేది అమృత తుళ్యమైన జీవితమైతే... ప్రేమ విఫలతలో మిగిలేది అజరామరమైన జ్ఞాపకం... వాటి తునకలు భావుకతలూ,కవితలూనూ.. ఇవి యాంత్రికాభిలాషికి అవహేళనా సాధనాలు, నిజ ప్రపంచ సాధకునికి నిరోధక భావాలు, సాంప్రదాయకునికి  హేతువాదోపకరణాలు, సమయపాలనాదక్షుణికి నిరర్ధకాలు.. ఇంకా చాలా చాలా మందికి చాలా రకాలు.. రకరకంగా రకరకాలు.. నిజంగా ఇవి కాలేవేమో నా శిలాక్షరాలు కానీ... ఇవి వాటి ఆవిర్భావ సమయపు భావా'వేశాలు', భావోద్రేకాలు... 
 
 

Monday, July 26, 2010

నేను to ఆ అమ్మాయి...

నీలో ఏముందో తెలియదు.. నిన్ను చూసిన ఆ లిప్తలో, నీ కళ్ళతో నా కళ్ళు చూపులు కలిపిన ఆ క్షణం.... ఏదో పరవశం, నన్ను ఏ లోకాలకో తీసుకుపోతుంది... విధికి ప్రేమన్నా, మనిషి మనసన్నా, గుండె బరువన్నా ఎందుకంత అలుసో, రెండు మూడు క్షణాల కన్నా నన్ను నిన్ను చూడనివ్వదు.. పోనీ నీతో మాట్లాడదామంటే... అమ్మో, గుండే వేగం పరుగులు తీస్తుంది, కష్టం.. నీ గురించి తెలుసుకునే నా మూగ ప్రయత్నాలలో... అందంగా నవ్వే నీ ముఖం, మెరిసే నీ కళ్ళు.. వాటికి ఓ రెండు సోడా బుడ్డీ కళ్ళద్దాలు తప్ప.. కనీసం నీ పేరేంటో కూడా తెలుసుకోలేకపోయాను..... నీతో పరిచయం, ప్రణయం, పరిణయం.. ఇలా ఇంకా ఇలాంటి ఏ కలలోనూ విహరించలేదు.. ఎందుకంటే... నా కలల కోటకి నీ ఇష్టమనే పునాది ఉందో లేదో తెలియకుండానే కడితే... నేను కట్టిన కోట కూలి.. నా మనసుకి పడే బీటల్ని పూరించగలిగే శక్తి లేనివాన్ని... ఐనా దూరం నుండో, దగ్గర నుండో నిన్నలా చూసి.. పొరపాటుగానైనా నువ్వు నన్ను చూడాలనే ఆశతో ఉర్రూతలూగే నా హృదయానికి తెలియదు.. నా ఈ మనసు మూగదని మాటలు రానిదని, నిన్నెప్పటికీ చేర సాహసించలేనిదనీ..... పాపం పిచ్చి మనసు నిన్ను సొంతం చేసుకునే ధైర్యం లేక ఒక జీవితకాలం కనీసం నిన్ను కనిపించేట్టు చెయ్యాలని దేవునికి చేసే ప్రార్ధనలు వింటూంటే.. దాని ఆశని చూసి ఏడవాలో.. దాని అజ్ఞానాన్ని చూసి నవ్వాలో తెలియటం లేదు :(

Saturday, July 24, 2010

వర్షించని మేఘాల సాక్షిగా...


ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఉగాది సందర్బంగా మా క్యాంపస్లో కవితల పోటీ పెడితే.. దానిలో పాల్గొన్నాను.. "వర్షించని మేఘాల సాక్షిగా...." అనే వాక్యం పైన కవితలు రాయాలి... నాకేమో కవితలు రాయటంకానీ, కవితలు ఇలాగే రాయాలనే రూల్సు కానీ ఏమీ తెలీదు.. ప్రతీ ఒక్కరూ విజ్రంభించి రాసేస్తున్నారు.. మేఘం, వర్షం, వాన, చినుకులు తర్వాత దాని ఫేటు ఇంకుడు గొయ్యా లేక డ్రైనేజీయా.. ఇలా పదాలు వస్తున్నాయి కానీ ఫీలింగు రాలేదు.. దగ్గర దగ్గర అరగంట టైమిచ్చారనుకుంటా.. ఐనా మాత్రం తెలిసిన పదాల్ని వరుసలో అమర్చేస్తే కవితలైపోతాయా.. అవ్వొచ్చు గాక.. కానీ కవితంటే అందులో‌ ఏదో భావుకత ఉట్టిపడాలని నా మనోఉవాచ.. ఇరవై నిమిషాలకి ఏమీ తేలక పేపరిచ్చేసి బయటకొచ్చేద్దామనుకుంటే.. అప్పుడే ఒక ఐడియా వచ్చింది.. బ్యాగ్గ్రౌండులో మనకి కూడా ఏదో జరిగి ఉంది కదా అని... మిగిలిన ఐదు నిమిషాల్లో ఏదో కవిత అనిపించేలా రాసేసి ఇచ్చేశాను.. నేను రాసిన కవిత విషాదాంతంతో కూడి ఉంది.. బయటకొచ్చాక.. ఎవరో చెప్పారు, బర్గర్లు పప్పుతో చెయ్యరు బంగారూ అన్నట్లుగా.. లవ్ ఫెయిల్యూర్ల కవితలకీ గట్రా అక్కడ ఎవరూ ప్రైజులివ్వట్లేదని తెలిసింది.. కానీ ఐదు నిమిషాల సమయంలోనే చాలా ఎక్కువగా ఆలోచించాల్సొచ్చేసరికి నాకు తలనొప్పి పట్టుకుంది.. అదేదో నాక్కూడా బ్రెయిన్ ఉంది అని నిరూపించటానికన్నట్లుగా.. కాకుంటే సంతోషించే విషయమేంటంటే, మా రూమ్‌మేట్‌కి ఫస్టు ప్రైజ్ వచ్చింది.. అదేదో నాకు వచ్చినంత సరదాగా ఫీలయ్యాను.. ఔను మరి కవితలంటే ఇష్టం.. కానీ భాషాలేమి.. టైం దొరకదు.. ఇలా పరిస్థితులు మరి... బాధాకరమైన విషయమేంటంటే ఇప్పటికీ మెచ్యూర్డుగా వ్రాయటం నాకొచ్చో రాదో డౌటు పడుతుంటాను... కానీ ఈ కవిత చూసినప్పుడల్లా అనిపిస్తుంది.. నాలోని కోపిస్టిని నిద్ర లేపి కొరడా ఝలిపించి మరీ వ్రాశానేమో అని...


Friday, July 23, 2010

హౌస్ హస్బండ్...

వహవా కాన్సెప్ట్ వింటూంటేనే చాలా అద్భుతంతా ఉంది.. హ్యాపీగా పెళ్ళి చేసుకుని.. రోజూ భార్య ఆఫీసుకెళ్ళి వస్తూ సంపాదిస్తూ ఉంటే.. ఇంట్లో వంట చేస్తూ ఆమె రాగానే "హాయ డార్లింగ్, ఏంటి ఈ రోజెలా గడిచింది", అంటూ వేడి వేడి కాఫీ కప్పొకటి ప్రేమతో ఆమెకందించి... తన అలసట తీరేలా.. కాసేపు మాట్లాడి... ఉతికి ఇస్త్రీ చేసిన టవలొకటి తన చేతికందించి స్నానానికి పంపించి వంటకి సరుకులు సామాన్లు సిధ్ధం చేసుకుంటూ ఫాస్టు ఫాస్టుగా వంట చేస్తూ.. మద్యలో ఆమె వచ్చి.. "ఆ తొక్కలో వంకాయ కూర నీకు సరిగ్గా వండటం రాదు.. కాస్త ఆమ్లెట్ వెయ్యొచ్చుగా", అంటూ ఏవేవో సలహాలిస్తూ.. అలా వెళ్ళి సోఫాలో కూలబడి ఎల్జీ ఎల్‌ఇడీ టీవీ రిమోట్ కంట్రోల్ పని పడుతూంటే.. అర్ద గంటలో వంట రెడీ చేసి.. అరముద్దలను గోముగా టేబుల్ స్పూన్లో పెట్టి తినిపిస్తూ.. మద్యలో నా తలపుల కారణంగా తను పొలమారితే.. గలాసుతో మంచి నీళ్ళు తాగించి.. "నువ్వు నాలో సగ భాగం కాదు నా ప్రియతమా, నువ్వే నేను", అని చెప్పి.. తన హృదయాంతరాళంలోనికి చొచ్చుకునిపోయి.. తరువాయి బాగంలో రసాస్వాదనానంద ఢోళికా సుమమధురాధర రసాస్వాధనారాధాకులమై........................!!

 ఇలా.. ఇలా.. చెబుతూ పోతే ఈ పేరాగ్రాఫ్ ఎప్పటికీ అవ్వదేమో... కానీ ఇంతకి ముందెవరూ ఈ రకంగా అనటం నేను వినలేదు.. 

"బాబూ నీకు పెళ్ళి చేసేస్తే మాకో గొడవొదిలిపోతుందిరా.." ప్రతి ఒక్కరి అమ్మ కూడా యుక్త వయస్సు వచ్చిన తన పిళ్ళాడితో చెప్పే మాట ఇది.. అంటే పెద్దవాళ్ళ గొడవొదిలిపోయి ఆ గొడవేదో చిన్నవాళ్ళకి అంటించాలని అనుకుంటా.. దురదగొండాకుని మనకి తెలియకుండా అంటించేయటమంటే ఇదేనేమో.. తర్వాత తోలూడితే మాత్రం వాళ్ళకేం పోయిందీ..  మా ఫ్రెండొకడికి పెళ్ళి సంభందాలు వెతుకుతున్నప్పుడు ఆడ పెళ్ళివాళ్ళడిగారంట.. ఏం బాబూ ఏం వెలగబెడుతున్నావని (ఇలాగే కాకున్నా కొద్దిగా గౌరవ పదజాలంతోనే అడిగారంట).. "నేను యూనివర్సిటీలో పిహెచ్.డి. చేస్తున్నానండీ.." తలని సగర్వంగా పైకెత్తి.. పెళ్ళి చూపులకోసం మాత్రమే స్పెషల్‌గా కొన్న కళ్ళజోడుని సరి చేసుకుంటూ హుందాగా అన్నాడు మావాడు.. అంటే ఇంకా చదువుతున్నావన్నమాట..(ఇండైరెక్టుగా నీక్కూడా పెళ్ళికావాలా అని అన్నమాట), అసలు విషయం ఏంటంటే అమ్మాయి తండ్రికి పిహెచ్.డి. అంటే ఏంటో తెలియదంట.. అదేంటని ఆ సదరు మామ వరుసకి చెందినాయన ఆయన తమ్మున్నడిగితే.. వాళ్ళ తమ్ముడిచ్చిన సమాధానమేంటంటే, "అదేనన్నయ్యా, ఉద్యోగం రాకపోతే హాస్టల్లో పడి తింటూ, టైం వేస్టు చేస్తారు కదా అదే.." అన్నాడంట, అది విని మా వాడికి మొహమెక్కడ పెట్టుకోవాలో తెలియక.. అమ్మాయిని చూడకుండానే వెనక్కొచ్చేశాడంట.. ఏం చేస్తాం ఎనక్కొచ్చాక వాడు మాకందరికీ భగవద్గీత చెప్పేశాడు, అది వినలేక మేం చచ్చాం... 

ఏం నమ్మట్లేదా... మానేయండీ.. ఔను మరి.. హ్యాపీగా ఎటువంటి షంటింగూ లేకుండా అద్భుతంగా ఉంటూ ఎవరి దాదాగిరీ లేకుండా మనం ఉండాలనుకోటం తప్పా చెప్పండీ.. ఏంటో సంతోషంగా ఉంటే చూడలేరనుకుంటా ఈ పెద్దవాళ్ళంతా.. "ఈ పెద్దోళ్ళున్నారే.."....

పెళ్ళి చేసుకుంటే... మీ ఆవిడకి ఎలా నచ్చితే అలా ఉండాలి.. లేకపోతే ఆమె ఫీలౌతుంది.. పొరపాటున సోది చెప్పే వాగుడుకాయైతే.. ఆమెని కార్నివోరస్ పర్సన్ కోవలోకి తీసుకోటం మంచిది.. కొన్నాళ్ళకి మీ బ్రెయినంతా తినేయబడి మీరు భోంచేస్తున్నప్పుడు కూడా నోట్లోంచే ఎందుకు తినాలి, నవ రంధ్రాలున్నాయి కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడదాం లాంటి క్రియేటివ్ పధ్ధతుల గురించి ఆలోచించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఇంకో కేటగిరీ అమ్మాయిలుంటారు వీళ్ళు జనరల్‌గా ఏమీ మాట్లాడరు.. వాళ్ళని మనమే అర్దం చేసుకోవాలంట.. వాళ్ళకేం కావాలో చెప్పకుండానే తెలుసుకుని అలా మనకి నచ్చినా నచ్చక పోయినా చేసేస్తూనే ఉండాలంట.. వీళ్ళ మాటల్లో "నీ చూపులు నా వీపుకి గుచ్చుకున్నాయ్" లాంటి పోకిరి సినిమా డైలాగులు చాలా చాలా వినిపిస్తూ ఉంటాయి.. ఐనా మనం మనల్ని మనం అర్దం చేసుకోటానికే చాలా సార్లు పని పెట్టుకుని ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సొస్తుంది, వీళ్ళనెలా భరిస్తాం చెప్పండి... మరో కేటగిరీ అమ్మాయిలుంటారు వీళ్ళకి మనమీద ప్రేమ పుట్టాలంటే మనకి మన పనితోపాటుగా ఏ ఫ్యాక్టరీనో లేక జువలరీ గని లాంటిదో ఉండాలి..

పోనీలే ట్రూ లవ్ చేసే అమ్మాయెక్కడా ఉండదా అని అనుకుందామంటే, హెల్లీ తోకచుక్క చూడ్డానికి అరవై సంవత్సరాల కాలం ఆకాశం చూస్తూ టైం వేస్టు చేసుకునే వాడిలా చూస్తారు మీ మిగులు జనాలందరూ.. ఒక వేళ మీరు హైదరాబాదులో ఉంటే ఎర్రగడ్డని, విశాఖపట్నంలో ఉంటే చినవాల్తేరునీ మీ అడ్డాగా చేసేందుకు ప్రయత్నించేవారు కూడా అందులో ఉంటారు..

బ్రతకాలంటే సంపాదించాలి.. అదే పెళ్ళి చేసుకుంటే, చచ్చినట్లు చచ్చో చెడో‌ సంపాదించాలి.... చాలా మంది అభిప్రాయం ప్రకారం.. తమరు మొగుడు/మగాడు టైప్ పదాలకర్హత సంపాదించాలనుకుంటే మినిమం ఒక బంగ్లా, కారూ, శాలరీ ఫెయిరూ మరియు మీరు లవ్లీ అయ్యుండాలంట...

ఒక వేళ పాత చింతకాయ పచ్చడి పులుపులాంటి అభిప్రాయాలేమైనా మీ దగ్గరున్నట్లైతే, మీ పని ఔట్.. ఏమంటే "నువ్వేమైనా పుడుంగువా, మొగుడైతే నాకేంటి.. నేనేమైనా అప్పలమ్మననుకున్నావా, మైండ్ యువర్ టంగ్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్.. " ఇలా దులిపేసి మీ చింత పులుపుని సింకులోకి కడిగి పారేస్తారంట... 

బహు పరాక్, బహు పరాక్.. ఇట్ సీమ్స్ దట్ పెళ్ళి ఈజ్ బహు చిరాక్ బహు చిరాక్... చెప్పండీ పెళ్ళవసరమా??

ఇంక పెద్దవాళ్ళ విషయానికొస్తే.. మనికిష్టం ఉన్నా లేకున్నా పెళ్ళి చేసేసి.. చేతులు దులిపేసి వాళ్ళు చిన్నవాళ్ళైపోతారు.. పొరపాటున మీరు మీ ఆవిడ అనే జీవంతో ఎక్కువగా మాట్లాడి.. మీ పెద్దోళ్ళతో తక్కువగా మాట్లాడారనుకోండి.. పెళ్ళయ్యాక వీడు బాగా మారిపోయాడు.. ఏం చేస్తాం అడ్డాలనాడు బిడ్డలు కానీ గెడ్డాల నాడా.. అని వాళ్ళు పక్కింటోళ్ళతోనో లేదా తెలిసినోళ్ళతోనో చెప్పటం.. వాళ్ళు ఒకవేళ మీకు క్లోజ్ ఐతే పర్సనల్‌గా మీటయ్యి మీకు ప్రైవేటు చెప్పేయటంలాంటి విషయాలన్నీ జరుగుతాయి.. ఒక వేళ మీ అవిడకీ మీ అమ్మగారికీ పడట్లేదనుకోండి.. ఎడ్వెర్టైజ్‌మెంట్లు లేకుండా టీవీ సీరియల్ చూసినట్లుంటుంది మీ జీవితం.....

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, కోకొల్లలు.. కానీ ఇవన్నీ ఎప్పుడంటే.. మీ మనసులో హస్బండంటే ఒక ఇది... మీరు చెప్పినట్లే మీ వైఫ్ వినాలి, ఆమొక కుక్కిన పేను.. వంటింటి కుందేలు కావాలి.. ఇలాంటి ఫీలింగ్సున్నప్పుడన్నమాట..

అలా కాకుండా మీరు ఈ ఆర్టికల్ ఫస్టు పేరాలో చెప్పినట్లు సిగ్గు పడకుండా(మీరు సిగ్గు లేకుండా అని అంటున్నారు.. నాకు వినపడింది) హౌస్ హజ్బండుగా ఉన్నారనుకోండీ.. ప్రేమకి ప్రేమ.. రిలాక్సుకి రిలాక్సు.. మీ పేరెంట్సుకి మీరే సేవ చేసుకోవచ్చు.. ఇలా అద్భుతంగా ఉంటుంది..... కాదా మరీ.. అమ్మాయిలు హౌజ్‌వైఫ్స్ కావచ్చు కానీ అబ్బాయిలు హౌజ్‌హజ్బండ్స్ కాకూడదా?.... "వై షుడ్ గర్ల్స్ హేవ్ ఆల్ ది ఫన్"


Wednesday, July 21, 2010

పెహెలే ఏ బోలో..

మేరా దిల్‌కీ "గరుకు" దీవారో పే............. నామ్‌ నామ్‌ హై తేరా తేరా.............. పెహెలే ఏ బోలో నామ్‌ క్యా హై తేరా?

కావా నా చిరునామా..

ప్రేయసిని చూసిన క్షణంలో, ఆమె ఆలోచనలలో మునిగి తేరుకోని ఆనందపు లోతులో ఉన్న సమయంలో..  ఆమె గురించిన ప్రతి విషయం ప్రియుణ్ణి ప్రభావితం చేస్తుంది.. ఆమె తలపే వివశుణ్ణి  చేస్తుంది.. ఆమె చూపే కొత్త శక్తినిస్తుంది.. తనలోనే లేని శక్తి తన ప్రియుణికి ఎలా తన వలన ఎలా వస్తుందో తెలియక ఆ ప్రేయసి అవాక్కైనా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.. మనసుతో చదివితే కవితలో భావాలు, గుళాభీ రేకుల మృదుత్వాన్ని, మల్లె పూల సువసనని, అంతు లేని ఆనందాన్ని కలిగిస్తుంటాయి... మరి ఆ భావాల్ని నాకోసం నేను పలికించుకుని, నేను అంతగా అనందించగలిగాను... కానీ ఆ అనందం ఊహే అని తెలిసినందుకు దుఃఖించాలో లేక కనీసం ఊహైనా ఐనందుకు సంతోషించాలో ఏమో...!! నా ప్రేయసి నా ఊహల్లోనే ఉంటే.. ఈ నిజ ప్రపంచంలో ఎందుకు వెతుకుతున్నానో.. ఇక్కడ ఎందుకు జీవిస్తున్నానో......   మళ్ళీ ఏమో? ఎందుకో?...  మరి ఎప్పుడౌతుందో ఆమె నా చిరునామా?!?!?!.........

Tuesday, July 20, 2010

ఏమిటో? నా ఈ సోది? ఎందుకనో?

అందరూ హ్యాపీనెస్‌ని తమతమ పర్యవసానాలతో  ముడి పెట్టుకుంటున్నారు.. కానీ పర్యవసానాల్ని పూర్తిగా మన కంట్రోల్లో ఉండేట్టు చేసుకునే పద్దతి ఏదీ ఇంకా మనకందుబాటులో లేదనే చెప్పాలి.. అందుకే వాళ్ళ హ్యాపీనెస్‌ ఎప్పుడూ వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.. కానీ మన హ్యాపీనెస్ పైన ఆధారపడి మన ఆరోగ్యం, మన తతిమా స్థితి గతులు.. అంటే ఒక పని తర్వాత ఇంకొక పని అలా నిర్వహించే సమయంలో కూడా మనల్ని ప్రేరేపించేదీ, నడిపించేదీ మన హ్యాపీనెస్సే.. ఈ సీక్రెట్ తెలుసుకున్న నేను మాత్రం నా హ్యాపీనెస్‌ని బేవార్సిగా ఫేట్‌కి వదిలెయ్యకుండా.. నా ప్రెజెన్స్  లేదా ఎగ్జిస్టెన్స్ పైన ఆధారపడేట్టు చేసుకున్నాను.. అలా ఐతే పర్యవసానాలేమైనా కానీ మనమెప్పుడూ హ్యాపీగానే ఉండొచ్చు.. రిజల్టు ఏమైతే నాకేంటి.. రెస్పాన్సిబులిటీ ముసుగేసుకున్న ఆ అన్-హ్యాపీనెస్ నాకక్కర్లేదు.. ఎవరేమనుకుంటే నాకేంటి ఎవరేమైతే నాకేంటి.. కావాలంటే చెయ్యగలిగే హెల్ప్ చేస్తాను కానీ.. ఇంకా కావాలంటే బాధ వినమంటే‌వింటానేమో కానీ.. బాధ పడమంటే.. టాటా.. బాయ్ బాయే.. నీకు వీలైతే నిన్నిబ్బంది పెట్టే విషయాలని శత్రువుల్లా  చూడకుండా వాటిని దాటిపోలేండా అడ్డుకుంటున్న విషయాలని ఒక సూపు చూ.. అప్పుడు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటా.. అన్‌హ్యాపీనెస్ లేకుంటే హ్యాపీనెస్ విలువ తెలీదని ఆర్గ్యూ చేస్తావా.. అలా అనుకోవటంలోనే నీకు హ్యాపీనెస్ ఉందని ఆర్గ్యూ చేస్తాన్నేను.. కాబట్టి చెప్పేదేంటంటే.. దోమ కుట్టి  నొప్పి, దురద.. పెడుతూంటే ఏనుగులకలా కుట్టి రక్తం పీల్చే అవసరం లేదని హ్యాపీగా ఫీలవ్వాలి.. ఏం నువ్వెప్పుడూ రియాలిటీలోనే బ్రతకాలనుకుంటున్నావా.. నీ సంతోషాన్ని హరించేసే రియాలిటీని ఏం చేసుకుంటావ్.. అది నాలిగ్గీసుకోటానికి కూడా పనికి రాదు తెలుసా.. తర్వాత నీ ఇష్టం మరి..
నేస్తం..

నాకు ప్రియమైన నా మనసు.. తను మరణించి నన్ను జీవచ్ఛవంగా మార్చిన తరుణంలో.. నా ఆక్రోశం ఆక్రందనగా మరల్చగా.. దానికీ కవిత అక్షర రూపం
పంచు

Monday, July 19, 2010

నీ ప్రేమ భావనలో.. నేనెక్కడో?

నిన్ను చూస్తూనే ఉన్నా.. ఐనా నీ మనసుకి తెలియట్లేదా?, ఔను తెలియాలంటే నువ్వు నన్ను చూడాలి కదా.. నువ్వు కనిపించే ఆ క్షణాన్నే..  తడి ఆరిన బంజరు భూమిపై తొలకరి మేఘపు వానలు చిరు జల్లులై కురిసినట్లుగా, శిశిర ఋతువు చలి తాకిడిలో మూగబోయిన కోయిలకి వసంతమై కానుకగా వచ్చినట్లుగా.. నా మనసు భావిస్తుంది.. కళ్ళు పట్టనంత విశాలమైన ఈ ప్రపంచం నిన్ను చూడగానే మాయమైపోతుందో ఏమో.. నువ్వు తప్ప ఏమీ కనిపించని ఆ మాయని ఎలా ప్రేరేపించగల్గుతున్నావ్.. విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలని నీ మాటల్లోనే అనే గానంలో పదాల్ని నిజంగా నిజం చేస్తున్నావ్. ఎన్ని తరాలైనా, ఎన్నెన్ని యుగాలైనా ఈ ప్రేమ భాషలో మార్పుండదేమో.. ఎన్నటికీ ఈ ప్రేమ భావనలో చేవ తగ్గదేమో... నిన్ను ప్రేమించాలనే ఆలోచన నా మనసుని ఒక లేగ దూడల్లే ఉరకలేయిస్తుంటే.. నువ్వు నన్ను ప్రేమిస్తావో లేదో‌ అనే ఆలోచన, నా ప్రేమ భావాల ఊచకోతకి సిధ్ధమౌతోంది.. నా మనసు భాషణకే నిన్ను పలికించే శక్తి ఉంటే, మాటాడకనే నాలోని నీపై ప్రేమనంతా నీకు వివరించేయనా... నీతో పరిచయమయ్యాక నేన్నీకు నచ్చకపోతే ఎక్కడ నా ప్రేమకి తెర పడుతుందో అనే భావనలో.. నీ కళ్ళలో నన్నిష్టపడే కాంతి రేఖల కోసం ఎదురు చూస్తూ, నా మనసులోనే నిన్నారాధిస్తూ.. మూగగానే నా మనసు ఆలపించే గానాల సంగీత విభావరిని ఆనందిస్తున్నాను.. నువ్వు దరిలో ఉన్న క్షణాన్ని ఆస్వాదిస్తూ.. నిన్ను పలకరించమని నా మనసు చేసే చిలిపి అల్లరిని చిరు కోపంతో వారిస్తూనే, నా మనసుని సంభాలిస్తూ.... "నిన్నే ఆరాధించే నీ దానిని.. నీ ప్రేమే ప్రాణాలైన సుమరాణిని.." అంటూ నా కళ్ళలో ఆనంద మేఘాలు కన్నీటి చినుకులై రాలకముందే నీ మేఘ సందేశాన్నందిచాలని కోరుకుంటూ.. 
నీ 
~ మౌళి


పంచు

Tuesday, July 13, 2010

నాపై నీ ఇష్టం ఒకటీ బై సున్నా ఐతే.... :)


ప్రేయసి అందాన్ని అతిశయోక్తులు కూడా అందుకోలేనంత అతిగా పొగిడేస్తూ.. అనంతమైన ఇష్టానికి పరాకాష్టగా గణితాన్ని కూడా కవితలో ఇరికించేసి ఇబ్బంది పెట్టాను.. మరి కానీ తనని ఆకర్షించే అయస్కాంతం గురించి ఇనుము లాంటి నేనే ఇంతగా కోరుకుంటే.. అంతటి ఆకర్షణ శక్తి కలిగిని అయస్కాంతంలాంటి ప్రేయసి ఏం కోరుకోవాలి... ఐనా నా యుటోపియన్ వరల్డులో నేనూ తనే ఉంటాం కాబట్టి నో ప్రోబ్లం.. ఇంతకీ తనెక్కడుందో ఏంటో.. ఎలా ఉంటుందో.. తలచుకుంటేనే.. ఏదో ఏదేదోలా ఉంది... :) ఐనా నా వెర్రి కానీ ప్రేయసి లేకుండానే ప్రేమేమిటో?! :)


పంచు

Monday, July 12, 2010

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ..(by సిరివెన్నెల)

"ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ.."  సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి కలం మరియు గళం నుండి జాలువారిన... ఒక మనోవికాసపూరితమైన గానం.. మాటలకి ముత్యాలు రాలే నానుడిలో నిజమెంతో తెలియకున్నా... ఈ పాటలో రాలే భావాలు ముత్యాలనే అబ్బురపరిచే అద్భుతాలని విన్నాక మీరే చెబుతారు..


పంచు

Sunday, July 11, 2010

నా సఖియా..

ఈ ప్రపంచంలో అమ్మాయిలెవరూ నాకు సైట్ కొట్టకపోతే ఏమైంది.. నా ఊహాలోకం నాకు లేదా.. ఐనా నా డ్రీం గర్లు  ముందు, ఈ మిస్ వరల్డులూ.. మిస్ యూనివర్సులూ ఎందుకు పనికొస్తారూ.. అఫ్‌కోర్స్ నా డ్రీం గర్లుని నేనూ ఇంత వరకూ చూడ్లేదనుకోండీ.. ఏమైనా ఆ అందమే అందం..
పంచు

Saturday, July 10, 2010

భాద్యత(Responsi.."ability")

అదేంటో భాద్యతాయుతంగా ఉండేవాళ్ళు ఎంత సౌమ్యంగా ఉన్నా.. ఎంత సామరస్యంగా డీల్ చేసినా.. వాళ్ళను చూస్తే ఒక రకమైన భయం, మరో రకమైన గౌరవం కలుగుతుంటుంది అందరికీనూ.. భాద్యతాయుతంగా లేని వారికి ఎంత కౌశలం, పాటవం ఉన్నా.. ఆ సాధికారత రాదెందుకనో.. కానీ బాగా భాద్యతతో ఉన్నావాళ్ళలో, సరదాగా మాట్లాడేవాళ్ళని చాలా తక్కువ మందిని చూశాను.. బహుశా భాద్యతా,భారాలు మిత్రులై.. భాద్యతా, సరదాలు శత్రువులై ఉంటాయనుకుంటా.. ఐనా అందరూ నాలాగా ఫన్నీగా ఉంటారనుకుంటే ఎలా.. కదా?! :) ... ఐనా ఏంటో.. ముందుగా ఎంజాయ్ అనే నెపంతో చిన్న చిన్న "కోరికలు" తీరేందుకు జీవితమనే మురుగు నీటి ఊబిలో దిగుతారు జనాలు... ఎంజాయ్‌మెంట్ చాక్లెట్ కోటింగున్న చేదు మెడిసిన్ లాగా ఉంటుంది.. కోటింగు కరిగిపోగానే.. భాద్యతలు.. ప్రతి ఒక్కరూ జీవితమనే ఊబిలో ఈదుతూ చిన్నప్పటి కుట్రలీశ్వరన్‌ రేంజిలో బిల్డప్పులిచ్చేవాళ్ళే... ఇంకా సరదా ఐన విషయం ఏంటంటే ఎవరెంత తక్కువ లోతు మునిగిపోతే వాళ్ళంత బాగా జీవితాన్ని గెలిచినట్లు వాళ్ళలో వాళ్ళే డిసైడ్ చేసుకుని.. వాళ్ళ గెలుపుతో, ఓడిపోతున్నారని వాళ్ళు ఫీలవుతున్నవారిని గేళి చెయ్యటం వారి సరదా.. ఒడ్డు మీదే ఉండిపోదామనుకునే వాళ్ళని.. లోపలికెళ్ళేవాళ్ళు లాగేస్తుంటారు.. ఒడ్డునున్నవాళ్ళు తోసేస్తుంటారు.. కొద్ది కొద్దిగా అర్దం చేసుకునేందుకు ట్రై చేసే విషయమేంటంటే బావ దారిద్ర్యపు భాషణాన్ని ఎవరూ పట్టించుకోరు కానీ.. భాద్యతా దారిద్ర్యపు జీవితాన్ని మాత్రం చేతకానితనం క్రింద భావిస్తారు...... జీవితం అనేది ప్రకృతి ఐతే జీతం అనేది వికృతి అంట... దాని ఆకృతి మళ్ళీ భాద్యతేనంట.. మరైతే కెలామిటీ అంటే ఏ కృతో?.............. ఏదో వ్రాశాను..... కారణాలేమీ లేవు.... ఇంత చదివాక మెంటల్ హాస్పిటల్‌కి ఫోన్ చెయ్యకండేం..... ఏం లేదు ఇలా వ్రాయగలిగే వాళ్ళ కాంపిటీషన్ తట్టుకోవటం చాలా కష్టమక్కడ....పంచు

Friday, July 9, 2010

ఆ కన్నీళ్ళ విలువ ఎంతో?!

మార్చిలో ఒక రోజు కైలాసగిరి ప్రక్కనున్న తెన్నేటి పార్కులో సాయంత్ర సమయంలో, జోరుగా వీస్తున్న గాలి హోరులో ప్రకృతిలో మమేకమైపోయి ఉన్న మనసుని తట్టి లేపిన కొన్ని ఊహలు...


పంచు

Wednesday, July 7, 2010

మసాజ్...

ఇందాకనే ఈ మసాజ్ ఫోటోని ఏదో వెబ్‌సైట్లో చూశాను.. ఈ మద్య హైదరాబాద్‌లో జరిగిన మసాజ్ ఉదంతాలు గుర్తొచ్చి.. మసాజ్ చేయించుకుంటున్న ఉడతకి కమీషనర్ ఎక్కడొస్తాడో అని భయంతో మసాజ్ చేయించుకున్నట్లుగా మార్చి ఇక్కడ పోస్ట్ చేశాను.. సరదాగా అనిపిస్తే మీరూ నవ్వుకోవచ్చు..మీ వ్యాఖ్యానంతో మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూపించండి....పంచు

విజిటింగ్ ఎ 'మోషన్‌'లెస్ ఫ్రెండ్...

నేనూ మా ఫ్రెండూ కలిసి మా ఇంకో ఫ్రెండింటికి వెళ్ళాం జస్ట్ అలా సరదాగా మాట్లాడుకుందామని. వెళ్ళేసరికి వాడు వాళ్ళింట్లో డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని దిగాలుగా మొహం పెట్టుకుని కళ్ళు పీక్కుపోయినట్లుగా ఉన్నాడు.. బాగానే పలకరించి మాతో పాటు కూర్చున్నాడు.. వాడున్నట్లుండి వాడిలో వాడే మాట్లాడుకుంటున్నాడు.. ఆ మోనో యాక్షన్ డైలాగులిలా సాగాయి..

"అది చెప్పినట్లు నేను వినటమేమిటి.. అయితే గియితే నేను చెప్పినట్లు అది వినాలి..

దాని వలన ఎన్ని సార్లు అనవసరమైన తిరుగులు తిరగాల్సొచ్చిందో..

దాని పీడ విరగడైతే నీకొక కొబ్బరి కాయ కొడతాను దేవుడా..

అబ్బబ్బ క్షణానికొక దేశమెల్లి వచ్చినంత పనయ్యింది.... "

ఇలా వాడి డైలాగ్ డెలివరీ సాగుతుంటే మద్యలో కల్పించుకుని అడిగాడు నాతో పాటుగా వచ్చిన ఇంకో ఫ్రెండు "అసలేమయ్యిందిరా, విషయం ఏమిటీ? ఏమైనా లవ్ ఫెయిల్యూరా? మాక్కూడా తెలియకుండా నువ్వు లవ్వెప్పుడు చేశ్శావేంటి?" దానికి వాడి సమాధానం, "ఒరేయ్ సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి." ఈ డైలాగు విన్నాక నేనన్నాను "ఒరేయ్, ఆ కష్టాలేవో చెబితే సీత కష్టాలకి ఆంజనేయుడంత సహాయం చెయ్యలేకపోయినా కనీసం విభీషణ సహాయం చేస్తాం కదా" అని. దానికి రిప్లైగా వాడన్నాడు "లేదురా ఇది ఎగస్ట్రీమ్‌లీ పర్సనల్, అడగద్దు ప్లీజ్" అన్నాడు.. 

చదువుతున్న మీకు మండినట్లే నాకూ మండింది.. మరి అలాంటోడివి అలా ఏకపాత్రాభినయం ఎందుకు చెయ్యాలని వాడిని దులిపేసి.. మేమొచ్చామని వంటింట్లో టీ తయారు చేస్తున్న ఆంటీగారిని(మా ఫ్రెండు వాళ్ళ అమ్మ) విషయమేంటాంటీ, లవ్వేమైనా ఫెయిలయ్యాడా అని అడిగాను.. దానికి ఆంటీ పగలబడి నవ్వి.. ఔను బాబూ మోర్నింగు నుండీ వాడికి మోషన్స్.. అందుకే బాత్రూముకీ వాడికీ లవ్ ఫెయిలయ్యీ అలా మూలుగు రూపంలో ఏకపాత్రాభినయార్తనాదాలు చేస్తున్నాడు.. వాడిని నువ్వు దులిపినట్లే నేనూ దులిపాను, కానీ అలాగే మాట్లాడుతున్నాడు..

ఈ లోపు ఒక గావు కేకలాంటి అరుపుతో మా ఫ్రెండుగాడి కేక వినిపించింది "మమ్మీ, వాడికెందుకు చెప్పావ్.. ఇంక చూసుకో వాడేదో ఎడ్వర్టైజ్‌మెంటు ఏజెంటులాగా అందరికీ చెబుతాడు" అన్నాడు.. దానికి మేమందరం పగలబడి నవ్వాం. ఇంకొంత సేపు మాట్లాడాక, మందులేసుకోరా లవ్ సక్సెసైపోతుందీ అని వాడికో ఎదవైజ్ ఇచ్చి వాడికి మందులు తీసుకొద్దామని వెళుతుంటే వాడు పిలిచి రిక్వెస్టింగు స్వరంతో స్లో మోషన్లో ఎమోషన్‌తో ఒక ఆర్డరేశాడు.. "ఒరేయ్, ఈ విషయం ఎవరితోనూ చెప్పనని ప్రామిస్ చెయ్యి ప్లీజ్.." అన్నాడు.. నేనందుకు ఒప్పుకుని ఇద్దరికి తప్ప ఎవరికీ చెప్పనని ప్రమాణం చేశాను.. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరూ అని ఆసక్తితో అడిగాడు.. కొద్దిగా దూరంగా జరిగి "అడిగినోళ్ళు, అడగనోళ్ళు" అని జవాబు చెప్పి లగెత్తాను.. వాడికి మోషన్స్ కావటం వలన వాడిలో మోషన్ తగ్గి నన్ను పట్టుకోలేక ఆగిపోయాడు.. బయటకొచ్చాక మెడికల్ షాపులో వాడికి కావాల్సిన మందులు కొని వాళ్ళ మమ్మీకి ఇచ్చేసి వాడికి అందకుండా పరిగెట్టుకొచ్చేశాక నేనూ నాతో వాడిని విజిట్ చెయ్యటానికొచ్చిన ఇంకో ఫ్రెండూ, ఇద్దరం కలిసి చాలా సేపు నవ్వుకున్నాం, తల్చుకుని తల్చుకుని మరీ...


పంచు

Sunday, July 4, 2010

తానసలు నా కొరకు జన్మించెనో లేక మానేసెనో..!!??

రాసిన కవితకి సూటవ్వని వ్యాఖ్యానాన్ని చేస్తున్నానేమో ఇక్కడ, లేదులే సూటయ్యే వ్యాఖ్యానమే.. ఔను మరి లవ్ చేసేవాడికి ఫీలింగ్సుండకూడదా.. ఇంట'ర్మీడియట్' స్టేజిలో లవ్ చేస్తే.. మూతి మీద మీసాలు కూడా లేవు.. నీకు లవ్వెందుకు అంటారు.. అదే డిగ్రీ లాంటి టైములో లవ్ చేద్దామంటే.. ప్రతి ఒక్కరూ మొహం అద్దంలో చూసుకోమనేవారే.. మరీ అంత ధారుణంగా ఉన్నానా నా ప్రొఫైల్ ఫోటో చూసి మీరే చెప్పండి.. పోనీలే అనుకుని పిహెచ్.డి చేసేటప్పుడు లవ్ అనే థాట్‌ని ఎవరితోనన్నా షేర్ చేసుకుంటే చాలు... ఇదేదో లవ్వంటే పూర్తిగా ట్రాష్/నేరం అని గుర్తించాల్సిన ఏజిలాగా చూస్తారు జనాలు.. ఏమో..  ఎంతమంది జనాలు లవ్‌ని ఏమన్నా.. నాకు మాత్రం లవ్వు చాలా గ్రేట్.. అందుకే ఎప్పటికైనా నాకు ఐ లవ్ యూ అని చెప్పే అమ్మాయి కోసం ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటాను.. ఎవరికైనా ప్రొపోజ్ చెయ్యమని సలహా ఇవ్వకండి, అలాగైతే మళ్ళీ మొహం అద్దంలో చూసుకోమనే 'డై'లాగొస్తుంది, మరీ అలా అద్దం సహనాన్ని పరీక్షించటం అనేది అమానుషం.. కాదేటి మరి??
పంచు

Friday, July 2, 2010

ఫిరానా: ఎప్పుడూ ఆకలితో ఉండే రాక్షసి చేపలు

నిన్ననే ఒక మెయిల్ చూశాను.. అందులో నీటి ఒడ్డున ఏదో పార్టీ జరుగుతున్న డెస్కు మీద జనాలు పరుగు లెత్తుతున్నట్టు కనపడుతున్నారు.. దాని తర్వాతి చిత్రాలలో చూస్తే.. ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం.. ఒక మోస్తరు నుండి తీవ్రస్థాయిలో గాయ పడిన మానవ మృత దేహాలు కొన్ని ఆ నీళ్ళలో కనిపించాయి.. దానికి కారణం ఏదో‌దారుణ మారణ హోమం అనుకున్నాను.. కానీ అరచెయ్యంత కూడా లేని కొన్ని చేపలు వాళ్ళని అలా తినేశాయని తెలిసి నిర్ఘాంతపోయాను.. 


File:Piranha fish.jpg      కార్డేట్స్..కెరాసిడే..కెరాసిఫార్మ్స్ కి సంబంధించిన చేపలంట ఇవి (బయలోజికల్లీ).. అంతే కాకుండా ఇవి సర్వభక్షకులంట(ఆమ్నివోరస్). వీటి సైజు ఆరు నుండి పద్దెనిమిది అంగుళాల వరకూ ఉండి.. అమెజాన్, పెరాగ్వేలాంటి నదీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయంట.. అంతే కాకుండా బంగ్లాదేశ్ ప్రాంతంలో కూడా కనిపించాయని చెబుతారు.. 

       దాని తర్వాత ఒక వీడియో చూశాను.. ఎవరో ఆసామి ఒక ఎలకని ఫిరానా చేపలుండే ఎక్వేరియంలోనికి వదిలాడు.. అంతే నిమిషం కూడా కాకముందే దాని వెన్నుపూస మాత్రం మిగిల్చాయవి..
File:Piranha.jaw.jpg

     వీటి పల్లు మరీ దారుగా దారుణంగా కనిపిస్తున్నాయి తెలుసా అమ్మో, ఒక్క ముక్కలో చెప్పాలంటే వీటిని రాక్షస చేపలని చెప్పొచ్చు.. నా సలహా ఏంటంటే మీరెప్పుడైనా తెలియని ప్రదేశాల్లో ఏదైనా ఏటిలోనో లేక, చెరువులోనో.. దూకే ముందు అక్కడి పరిస్థితుల గురించి, విష పురుగుల గురించి విచారించి మరీ దూకటం మంచిదని నా ఉద్దేశ్యం.. ఒకవేళ మీరు వేరే దేశంలో ఉంటే అప్పుడు ఇది మరీ అవసరం..    
ఇక్కడ ఇందాక నేను చెప్పిన విగత జీవులైన మానవుల ఛాయా చిత్రాలు ఉన్నాయి.. మీది వీక్ గుండె ఐతే చూడటం మానేయండి..
 ^
^^
^^^
^^^^
^^^^^
^^^^^^
^^^^^^^
^^^^^^^^
Share

Thursday, July 1, 2010

మనసా మన్నించవా...

..........నిజమే ఎన్నాల్లపాటో ఒంటరిగా వదిలేసి, తన ఉనికినే గుర్తించకుండా  మనసుని, ఒక్కసారిగా పలకరించినంత మాత్రాన మాట్లాడేస్తుందా.. అలిగి వెళ్ళి తను ఎవరికీ కనిపించని చీకట్లోనే కూర్చుంటుంది... దానికి వేరే మనసు తోడూ లేక.. తన మనిషీ పలుకరించక.. జీవితమంతా విషాద నిశీధిలాగనే భావించి.. తన కన్నీటి ధారలతో శోక సంద్రాన్ని నింపి.. అందులోనే దుమికి అంతమైపోతుందేమో, అందుకే మనసా మన్నించవా అన్నా, మాటా మంతీ లేక మూగగా రోధిస్తూనే ఉంది...............


Share

రోబోట్ టోయ్ వీడియోలు..

ఈ వీడియోలో ఒక చిన్న పక్షి రోబోట్ ఉంది.. దాని ఎక్స్ప్రెషన్స్ చూస్తే బలే నవ్వొస్తుంది..
మీ మ్యూజిక్ సిస్టమ్‌ అలా ఒక చోటో కూర్చుని.. మ్యూజిక్ అందిస్తుంటే మీకు బోర్ కొడుతూ.. మంచి మూడ్ జనరేట్ అవ్వట్లేదా... వీలైతే దీన్ని ఈ వీడియోలో ఉండే రోబోట్‌ని ట్రై చెయ్యండి.. :)

ఫన్నీ రోబోట్ ఫైట్.... నిడివి తక్కువే ఐనా కొంచెం బాగుంది.. చూడండి...

Share