గాలి బాగా వీచిందని, నేల విడిచి సాము చెయ్యటానికి నువ్వేమైనా కాగితమ్ముక్కనుకున్నావా... భాద్యత గల సగటు మనిషివి, అలా ఉరకలేస్తావేం పెట్రేగి పోటెత్తుతున్న గంగానదిలాగా అని వారించాడు. భాద్యతలంటే అవేమైనా లంకెల బిందెలా, బరువున్నా నెత్తిన వేసుకుని మొయ్యటానికీ, మూసుకుని నీ పనేదో చూసుకో లేకపోతే మూతి పల్లు రాలుతాయ్ ... పాపం లేని పెద్దరికాన్ని మీదేసుకున్నాడేమో అని తనలో తానే ఫీలైనట్లున్నాడు, ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు నెమ్మదిగా బుద్ది చెప్పతలచిన మనిషి... జీవితం మీద ఆశ అనే జబ్బు పట్టుకున్న మనిషిలా కనిపించాడు తను.. ఆలోచనల్లో ఉన్న రెండో మనిషిని ఎలా తిట్టేసినా పర్వాలేదు, కానీ నిజ జీవితంలో ఎవరినైనా అలా తిడితే, పాపం ఎంత హర్టవుతారో ఏమో... అందుకేనేమో వీలైనంతగా సమాజానికి దూరంగా దాక్కుంటున్నాడు ఆ తిట్టేసిన మనిషి, కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే చందంలో... సంఘజీవి అంటే సంఘంతో కలిసి జీవించేవాడని అర్ధం కానీ, ఆ సంఘం పెట్టే షరతులన్నీ ఒప్పుకుని బ్రతికేవాడు సంఘజీవి ఎలా ఔతాడు?, ఇలా వాడి మనోబావాలు కోకొల్లలు... అన్ని భావాల్లోనూ జీవితమనే పదం మీద వాడు ఇంటూ గుర్తు వేస్తాడే కానీ ప్లస్ గుర్తు వెయ్యడు.. వాడిని పాపం ప్రతివాళ్ళూ కెలుకుతూనే ఉంటారు, దానికి ఉసూరుమంటూ... 'ఐనా సమాజాన్ని మనం అర్ధం చేసుకోవాల్సిందే తప్ప ఆ పిచ్చి కుక్క మనల్నెందుకు అర్ధం చేస్కుంటుంది లే' అనుకుంటాడు... తనకి అసలు పెద్దోళ్ళంటేనే పడదు, పెద్దరికాన్ని ప్రదర్శించే ప్రతి జీవీ తిట్టటానికే పుట్టాడనుకుంటాడేమో... వాళ్ళ మాటల్లో వినే ఆ నాలుగైదు వాక్యాలు కూడా ఎప్పుడూ పెద్దగా మారవు, "నువ్వు గాలి పీల్చినప్పుడు లేని బాధ, మీ అయ్య నిన్ను కడుపు నిండా మేపుతున్నప్పుడు లేని బాధ, ఈ సమాజం కట్టిన డబ్బులతో కట్టిన రోడ్లపై నువ్వు నడుస్తున్నప్పుడు లేని బాధ, నువ్వు విచ్చలవిడిగా బేవార్సిగా చిందులేస్తూ ఆడుకుంటున్నప్పుడు లేని బాధ..... బాధ్యతలు నీ చేతికొచ్చేసరికి పొడుచుకొచ్చిందా..." అంటూ "రుణం తీర్చు తరుణం వస్తే, తప్పించుకుపోతున్నావా, తెప్ప తగులబెట్టేస్తున్నావా" లాంటి పాటల్ని వినిపించేస్తున్నారు పాపం వాడికి... పోనీ వీడు తగ్గుతాడా వాళ్ళతో ఏకీభవిస్తాడా అంటే, వీడి సమాధానం ఇలా ఉంటుంది, "ఔను నేను బేవార్సే , నేను భాద్యతల్లేని సోమరిపోతునే , గాలికి నువ్వేమైనా డబ్బులు కడుతున్నావా?? కడితే కట్టేవ్ మూసుకుని నువ్వు పీల్చుకో... నన్ను కన్నందుకు పెనాల్టీగా మా అయ్య నన్ను పోషిస్తున్నాడు, ఆయన మంచి మనసుతోనే పోషించినా, మీలాంటి వరస్టు ఫెలోస్ అంతా కలిసి ఆ అయ్యల జాబితాల్లో అందరినీ వాళ్ళ కొడుకుల్ని ఎదవల క్రింద ట్రీట్ చేసేలా చేస్తారు, నువ్వు చెప్పేటట్లు జీతమొస్తేనే అది జాబ్ ఔతుందా, నీలాంటి పెద్ద డాష్ డ్యాష్ గాళ్ళంతా పొగిడితేనే పిల్లల్ని కన్న నాన్నలందరికీ పుత్రోత్సాహం రావాలా, ముందు సుమతీ శతకం రాసినోడ్ని తన్నాలి పట్టుకుని, అందరూ ఇచ్చిన డబ్బుల్తో వేసిన రోడ్లో యాక్సిడెంటైనోడికి ఒకడికి కనీసం రూపాయి సాయం చెయ్యలేదు నీలాంటోళ్ళు నిండి ఉన్న బోడి సమాజం, తొక్కలో సమాజం... మీలాంటి చాదస్తపు ఎదవలుండే జన సమూహాన్ని కూడా సమాజమంటారా, నచ్చని రోమన్ ఆచారాలతో జీవితకాలం రోమ్ నగరంలో రోమన్‌లాగా బ్రతికే కంటే మెసపటోనియాలో ఇసుకని పిండి వచ్చే నీటితో ఆ ఎడారి నేలలో బ్రతికేయటం మేలు వీలైనంత వేరం సమాజ శృంఖలాల నుండి తప్పించుకుని స్వేచ్ఛగా పోవచ్చు... నాకు చెప్పటం నీ భాద్యతని నువ్వు భావిస్తే, అది నాకు అక్కరలేదు... నన్ను ఇలానే వదిలెయ్..." ఇది వీడి వరస..
కానీ మూసపోతల సమాజ పోకడలు వీడిని వదుల్తాయా.... ఏమో??? , గాలి వీస్తే కాగితం ముక్క ఎగిరిపోతుంది, కానీ పేపర్ వెయిట్‌తో సహా ఎగరటం దానికి సాధ్యం కాదు.... సమాజపు కట్టుబాట్లనే ఆ పేపర్ వెయిట్లున్నా ఆ కాగితం ఎగరాలంటే ఏ టోర్నెడోలు రావాలో, ఎలాంటి టోర్పెడోల సాయం కావాలో... జీవితమంటేనే విసిగి వేసారిన ఆ మనసుకి ఇవన్నీ ఒక పట్టాన పడతాయో లేవో... ఆనందం, సంతోషం లాంటివాటి కోసం ఎన్నెన్నో చెయ్యాల్సొస్తుందని వాటిని కూడా విస్మరించేస్తున్నాడు... వాడికీ వాడి దగ్గరున్న బెంచీకీ తేడా ఏమీ లేదని వాడిని చూసి వెటకారంగా నవ్వుకునే వాళ్ళకేసి చూసి, బెంచీతోనే మాట్లాడుతూ ఆ జీవిత రోగంతో బాధ పడుతున్న మనుషులకీ, దూరంగా ఎక్కడో కొండల్లో దావానలంలో చిక్కుకుపోయిన ముళ్ళ తుప్పలకీ ఏమీ తేడా లేదని నవ్వుకుంటున్నాడు.... ఇది చదివిన మీరు ఎవరిని సమర్ధిస్తారో నాకు తెలీదు, నా అభిప్రాయాన్ని మాత్రం అడగద్దు... |
No comments:
Post a Comment