నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Saturday, December 4, 2010

నిద్ర....!? :)

నిద్ర...!! ఆహా ఎంత బాగుందో ఆ పదం వింటుంటే.... ఈ వాఖ్యం కూడా నేను నిద్రతో వాలుతున్న కళ్ళతోనే టైప్ చేశాను....
చిన్నప్పుడు ఒక  తొమ్మిది నెలలపాటు, పూర్తిగా నిద్రలోనే.... రోజులు గుర్తుండవ్ కానీ... ప్రపంచం చూశాక అర్దమౌతుంది నాకు... అంత చిన్నప్పుడు కనీసం భోజనం చెయ్యాల్సిన అవసరం కూడా లేదు... అమ్మ ఏది తింటే అందులోనే కొద్దిగా అందుతుంది... తినటానికి కూడా బద్దకమే ఐనంత నిద్రలో, వెచ్చటి ప్రదేశంలో, ఏ ఒడిదుడుకులూ లేకుండా, ఏ ఆలోచనలూ లేకుండా, కనీసం ఊపిరి కూడా పీల్చే పని లేకుండా, శరీరంలో మృదువైన కండరాలు అసంకల్పితంగా మాత్రమే కదులుతూ, స్వర్గమంటే ఏమిటో తెలియచెప్పేంతగా నిద్రపోయే వయసు అది.... ఈ జీవిత పాఠశాలలో అత్యంత సుదీర్ఘమైన శలవుల్ని అంతకంటే సఖ్యంగా వాడుకోగలిగే వయసూ, పరిస్థితులూ వేరే ఉండవు అనుకుంటా... బయటకొచ్చాక ఎవర్నీ ఎవరూ సరిగ్గా నిద్ర పోనివ్వరు... బాగా గాలి  పీల్చుకోటం నేర్చుకోకముందే అన్నం పెట్టేస్తారు... నిద్ర పోతాన్రోయ్ అంటే.. ఆడుకోమంటారు, పోనీలే ఆడుకుందామని చూస్తే  ఆ సరదా కూడా తీరకముందే  చదువుకోమంటారు.... ఈ పోటీ ప్రపంచంలో బడికెళ్ళి చదువుకోటం స్టార్ట్ చేశాక ఇంక నిద్ర అంటే ఏంటో, అదో ప్రశ్నార్ధకమే... చదువుకుంటున్నాం కదా కొద్దిగా ఎక్కువసేపు నిద్రపోదాం అనుకుంటే... అమ్మా, నాన్నలకీ ఇంకా మామయ్యలకీ ఇష్టమైన రైటర్లు, సైకాలజిస్టులు కొన్ని పుస్తకాలు రాస్తారు.. వాళ్ళు పెద్దవాళ్ళకోసం రాసుకోవచ్చు కదా... ఆహా! చిన్న పిల్లల మీదనే వ్రాస్తారు, పిల్లలు ఎక్కువసేపు నిద్ర పోతే.. సోమరిపోతులైపోతారు (వాళ్ళలాగా) అని ఇండైరెక్టుగా హింట్లు ఇస్తారు.... ఒకాయనేమో రోజుకి నాలుగ్గంటలు పడుకుంటే సరిగ్గా సరిపోతుందంటాడు, ఇంకొకాయనకి మొహమాటం ఎక్కువ, రోజుకి ఆరు గంటలు నిద్రపోవటం సబబే ఐనా, మూడు గంటల నిద్రతో కూడా పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని ఫలానా దేశంలో జరిగిన ఎక్సుపెరిమెంట్లలో తేలింది అంటాడు.... ఈయనేమన్నా చూసొచ్చాడా, ఆ అబ్బాయ్‌కి నాలాగా/హ్యాపీ సినిమాలో బ్రహ్మానందంలాగా కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటుందేమో..... ఇదంతా దేనికీ అంటే... స్కూల్లో ఫస్టొస్తేనే తర్వాత... ఆ తర్వాత... ఇంకా ఆ తర్వాత.... కూడా ఫస్టొస్తేనే.... గ్రాఫు బాగా పెరుగుతుందంట... ఐనా అందరూ ఫస్టుర్యాంకుకే చూస్తే మిగిలిన అంకీలన్నీ ఫీలవ్వవా?, మరీ అలా ప్రాకులాడటానికి ఫస్టు ర్యాంకేమైనా  వేడి వేడి ఇడ్లీనా లేప్పోతే గొప్ప ఫిగరా... ఐనా ఫస్టు ర్యాంకు వద్దని ఎవరన్నారు, కాకుంటే దాని కోసం నిద్ర మానెయ్యమంటే ఎలా?, ఇప్పుడే ఇంకొక విషయం గుర్తొచ్చింది.. అప్పుడెప్పుడో పురాతనకాలం చిన్నప్పుడు ఒకసారి టీవీ చూస్తుంటే, అందులో ఒక స్వామిజీ మరీ మరీ చెప్పేస్తున్నాడు, నిద్ర అంటే తమస్సు, అంటే అజ్ఞానం, అందుకే తమసోమా జ్యోతిర్గమయా అంటారు అని... నేననుకున్నాను "వాడి బొంద, అదేదో వాడు.. నిద్ర పోకుండా ఎన్నాళ్ళో తపస్సు చేస్తే స్వామీజీ ఐపోయినట్లూ", ఈ డవిలాగు నాలో నేనే అనుకున్నాను... గట్టిగా అంటే, అమ్మ కొడుతుంది మరీ... మా సోది మొహాలు కొందరు స్టేటస్ మెసేజీలూ, ఎస్సెమ్మెస్లూనూ.... అదేటీ అనే కదా మీ ప్రశ్నా, తొందరెందుకు చెప్తున్నాను కదా.. "డ్రీం ఈజ్ నాట్ వాట్ యు గెట్ ఇన్ యువర్ స్లీప్, బట్ ఇట్ ఈజ్ ద ఒన్ విచ్ డజంట్ లెట్ యు స్లీప్", వీళ్ళందరికీ నిద్ర అంటే బాగా అలుసైపోయింది.. పోకిరి సినిమాలో ప్రకాశ్‌రాజ్ లాగా ఒక నాలుగు రోజులు నిద్రపోనివ్వకుండా ఉంచేయాలి వాళ్ళని. మా కోర్సు వర్కులో టీచ్ చెయ్యటానికి వచ్చిన ఒకాయన చెప్పాడు ఆయన ఓన్లీ లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుని మేనేజ్ చేసేస్తాడంట, రోజుకి మూడు నుండి నాలుగు గంటలు మాత్రమే నిద్ర పోతాడంట... తనని "ఇన్‌సోమ్నియక్ విత్ ఇండైజెషన్ ప్రోబ్లం" అని పరిచయం చేసుకోటానికి ఇంత పాజిటివ్ యాట్టీట్యూడ్ అవసరమయ్యింది ఆయనకి... మళ్ళీ నిద్రని ఇంతగా తిట్టుకునే చండ శాశనులందరూ, వాళ్ళ  జీవితపు భాగహారంలో ఏమి సాధించేస్తారు అంటే... శేషం సున్నానే... అప్పుడు  పోయే నిద్రకి మరలా మెలుకువ కూడా ఉండదు....

ఏంటో, ఉదయం లేచిన తర్వాత మళ్ళీ పడుకునే వరకూ సరాసరి ప్రతి మనిషీ.. ఆ రోజునే కాకుండా అటు ఒక వారాన్నీ, ఇటు ఒక వారాన్నీ వర్చువల్‌గా జీవిస్తాడు... పిటీ కండిషన్ ఏంటంటే, తొంభై శాతం మంది ఆ వర్చువల్ లైఫ్లో భాదల్నే అనుభవిస్తారు... వాళ్ళ ప్రెడిక్షన్లకో దండం బాబోయ్!!.  నాకసలు అనిపిస్తుంది.. అలా డీప్ స్లీప్లోనికి వెళితే ఈ ప్రపంచం కానీ, ఇందులో ఉండే మనుషులు కానీ, తన పర భేదాలు కానీ, కోరికలు కానీ, ఆశలు కానీ, ఆర్తనాదాలు కానీ, భవిష్యత్తు మీది సంశయాలు కానీ, జవాబు దొరకని ప్రశ్నలు కానీ ఇలా ఏమీ అనిపించవ్... కనీసం ఒక రెండు వారాలు నేను పని కట్టుకుని చేసిన అబ్జర్వేషన్‌తో వందేళ్ళు తపస్సు చేసి ఒక మహర్షి తెలుసుకునే నిజంలో కనీసం రెండొందల పర్సెంటు అర్దమయ్యింది (నోట్:ఇది నా మైండుకి మాత్రమే కరెక్టు కావచ్చు)... నాకు క్రిందటి జన్మ ఉందో లేదో నాకు తెలియదు.. మళ్ళీ జన్మ ఉంటుందని నేను నమ్మను.. అందరూ ఆర్గ్యూ చెయ్యటం విన్నాను కానీ.. అలా ఆత్మ ఐపోవటాన్నీ, ఇంకో జన్మ ఉండటాన్నీ  ఎప్పుడూ చూడలేదు, వాటి గురించి మాట్లాడేవాళ్ళు ఏ ఆదారలతో చెబుతారో నాకెప్పుడూ అర్దం కాదు... నేనైతే ఎప్పుడూ చూడలేదు.. నమ్మలేదు.. నమ్మను కూడానూ... ఇలా ఆలోచిస్తుండే నాకు లైఫ్‌లో నిద్ర తప్పించి ఏదీ ట్రూ ఫన్ అని అనిపించలేదు... జీవితంలో అనుభవిస్తున్న టెంపరరీ నిద్రకి ప్రతి పగలున్నీ, ఒక ఇంటరెస్టింగు సినిమా సీన్ మద్యలో ఇంటర్వెల్లాగానూ, సీరియల్ బానిసలకి వాటి మద్యలో వచ్చే ఎడ్వర్టైజ్మెంట్లలాగానూ అనిపిస్తుంది... ఏం చేస్తాం, పూర్తిగా నిద్ర పోవాలంటే నొప్పిలేకుండా అవ్వదాయే... చట్టం దృష్టిలో అది ఒక నేరమాయే... నా అనే వాళ్ళందరికీ అది ఒక శోకమాయే...... అందుకే అందాక అంటే సంపూర్ణమైన నిద్ర దానంతట అది వచ్చేదాక, టెంపరరీ నిద్రనే ఎంజాయ్ చేద్దామని డిసైడయ్యా... ఇది నేను డెబ్భై శాతం నిద్రలో ఉండగా టైప్ చేసిన ఆర్టికల్, కాబట్టి అక్షర దోషాలుంటాయ్, వాటిని మీరు నిద్రలోనే చదివేసి అర్ధం చేసుకోండి....... చదివితే చదివారు, నేను తెలిసినవాళ్ళెవరూ, ఈ పోస్టు రాశానని మా ఇంట్లో వాళ్ళకి చెప్పకండి... ఏమి లేదు వాళ్ళు మళ్ళీ నా కోసం టీ కెటిల్ పట్టుకుని,నన్ను ఇన్సోమ్నియక్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తే కష్టం కదా... ఓకే నాకు బాగా నిద్రొస్తోంది.. గుడ్ నైట్... అండ్ సౌండ్ స్లీప్.. అండ్ నో డ్రీమ్స్  ప్లీజ్..... 

3 comments:

  1. @Paddu: Thank you very much for your compliment Ms Paddu :)

    ReplyDelete
  2. No words master....i wonder how u wrote such a nice article in sleep!!!! i think that is only possible in sleep as it is of no pressure and dead lines :-)

    ReplyDelete